నేపాల్ కొత్త మ్యాప్‌ వ్యవహారంపై గట్టిగా సమాధానం ఇచ్చిన భారత్..

0
149

నేపాల్ భారత్ జెండాలు

నేపాల్ ప్రభుత్వం లింపియాధురా కాలాపానీ, లిపులేఖ్‌ను తమ కొత్త రాజకీయ పటంలో చూపించడంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

దీనిపై మీడియా ప్రశ్నలు సంధించడంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. దేశంలోని ఏం ప్రాంతం మీదా ఎలాంటి వాదననూ భారత ప్రభుత్వం అంగీకరించదని అందులో చెప్పారు.

“నేపాల్ ప్రభుత్వం తను జారీ చేసిన అధికారిక మ్యాప్‌లో భారత ప్రాంతాలను చూపించడం ఏకపక్ష చర్య. అది చారిత్రక వాస్తవాలు, ఆధారాల ప్రకారం రూపొందించిన పటం కాదు” అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ చెప్పారు.

“సరిహద్దుల అంశాలను రాజకీయ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ద్వైపాక్షిక అవగాహనకు ఇది విరుద్ధం, ఇలాంటి కృత్రిమ విస్తరణ వాదనలను భారత్ అంగీకరించదు” అని ఆ ప్రకటనలో చెప్పారు.

ఈ అంశంలో భారత స్థితి గురించి నేపాల్‌కు చాలా బాగా తెలుసు. నేపాల్ ప్రభుత్వం ఇలాంటి మ్యాప్‌ల ద్వారా అనుచిత వాదనలకు దూరంగా ఉండాలి, భారత సౌర్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాలి” అని నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని భారత్ చెప్పింది.

ఈ ప్రకటనలో “దౌత్య చర్చల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోడానికి నేపాల్ నాయకత్వం ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని భారత విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

నేపాల్ ఇండియా
చిత్రం శీర్షికధార్‌చూలా, లిపూలేఖ్‌లను కలిపే ఈ దారి మానససరోవర్ మార్గంగా సుపరిచితం

అసలు విషయం ఏంటి?

ఇటీవల నేపాల్ క్యాబినెట్ ఒక కొత్త మ్యాప్‌కు ఆమోదముద్ర వేసింది. అందులో లింపియాధురా కాలాపానీ, లిపులేఖ్‌ను నేపాల్‌లో భాగంగా చెప్పారు.

నేపాల్ క్యాబినెట్ దీనిని సమర్థిస్తూ, “మహాకాళి(శారద) నది నిజానికి లింపియాధురాలోనే పుట్టింది, అది ప్రస్తుతం భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో భాగంగా ఉంది” అనే వాదన వినిపించింది.

ఆరు నెలల క్రితం భారత్ తన కొత్త రాజకీయ పటం విడుదల చేసింది. అందులో జమ్ము-కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్ము-కశ్మీర్, లదాఖ్‌గా చూపించింది.

అదే మ్యాప్‌లో లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్‌ను భారత్‌లో భాగంగా చూపించింది. నేపాల్ ఆ ప్రాంతాలు తమవని సుదీర్ఘ కాలం నుంచీ చెబుతోంది.

ఇటీవల భారత్ లిపులేఖ్ ప్రాంతంలో ఒక రహదారిని కూడా ప్రారంభించింది. ఈ మార్గం ద్వారా లిపులేఖ్ నుంచి టిబెట్ చైనాలోని మానససరోవరానికి వెళ్లడం సాధ్యమవుతుంది. ఆ రోడ్డు వేసిన తర్వాత భారత చర్యలను నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది.

నేపాల్ దినపత్రికలు
నేపాల్ దినపత్రికలు

‘సాహసోపేత నిర్ణయం’ – నేపాల్ మీడియా

లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగంగా పేర్కొంటూ నేపాల్‌ ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్‌పై ఆ దేశ మీడియా విస్తృతంగా కవరేజ్‌ ఇచ్చింది. ఆయా ప్రాంతాలు తమవేనన్న నేపాలీ ప్రభుత్వ వాదనకు ప్రాముఖ్యతనిస్తూనే భారత అభ్యంతరాలకు కూడా దినపత్రికలు, ఆన్‌లైన్‌ మీడియా సంస్థలు తగినంత ప్రాధాన్యతనిస్తూ ప్రచురించాయి. ఈ వివాదంపై భారత విదేశాంగ స్పందనను ప్రముఖంగా రాశాయి.

”నేపాల్‌ సరికొత్త మ్యాప్‌ ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చింది” అంటూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘గూర్ఖాపత్ర’ దినపత్రిక హెడ్‌లైన్‌ పెట్టుకుంది. ”మా దేశపు సరిహద్దులను రక్షించుకోడానికి మేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు” అంటూ నేపాల్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ మినిస్టర్‌ పద్మకుమారి అర్యాల్‌ చేసిన కామెంట్‌ను ఆ పత్రిక ప్రముఖంగా రాసింది . అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మరో పత్రిక ‘ది రైజింగ్‌ నేపాల్‌’ కూడా ”కాలాపాని, లిపులేఖ్‌, లింపియాధురా కలుపుతూ మ్యాప్‌ను విడుదల చేసిన ప్రభుత్వం” అంటూ బ్యానర్‌ ఐటమ్‌గా ఇచ్చింది. దాని కిందనే సరికొత్త మ్యాప్‌ను కూడా ముద్రించింది.

ఇక ప్రైవేటు రంగంలో నడిచే ‘కాంతిపూర్’‌, ‘ది కాఠ్‌మండూ పోస్ట్’‌, ‘అన్నపూర్ణ పోస్ట్’‌, ‘నాగరిక్’‌, ‘నయాపత్రిక’ లాంటి న్యూస్‌పేపర్లు కూడా నేపాల్‌ విడుదల చేసిన మ్యాప్‌ వార్తలతోపాటు, భారత ప్రభుత్వ అభ్యంతరాలను కూడా మొదటి పేజీలో ప్రముఖంగా ఇచ్చాయి. భారత్‌, నేపాల్‌లు ఇప్పుడు మ్యాపుల యుద్ధం మొదలు పెట్టాయన్న విశ్లేషకుల వ్యాఖ్యలను ‘ది కాఠ్‌మండూ పోస్టు’ పత్రిక ప్రచురించింది.

అంతకు ముందు కె.పి. ఓలి నేతృత్వంలోని నేపాల్‌ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను సిద్ధం చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ దేశానికి చెందిన పత్రికలు కథనాలు రాశాయి. ఇది చాలా సాహసోపేత నిర్ణమయమని కొన్ని పేపర్లు పేర్కొన్నాయి. భారత ప్రభుత్వంతో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదని ‘నాగరిక్‌’ దినపత్రిక తన సంపాదకీయంలో రాసింది.

అయితే ‘కాంతిపూర్‌’పత్రిక మాత్రం తన సంపాదకీయంలో నేపాలీ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించింది. ”ది బౌండరీ డ్రాన్‌ ఆన్‌ పేపర్‌”( పేపర్‌ మీద గీసిన సరిహద్దు) అనే పేరుతో చంద్రకిశోర్‌ అనే వ్యాసకర్త రాసిన వ్యాసంలో ”నేపాల్‌ ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించనంతకాలం, కాలపానీ ప్రజలు భారత ప్రభుత్వంపై ఆధారపడుతున్నంత కాలం, ఇప్పుడు గీసిన కొత్త మ్యాపులను చూసి దీపావళి పండగ చేసుకోవాలనుకోవడం ఒక ప్రహసనం” అంటూ విమర్శలు చేశారు. ” ఇది సరిహద్దు ప్రజల పుండు మీద కారం చల్లడంలాంటిది” అని తన కాలమ్‌లో చంద్రకిశోర్‌ వ్యాఖ్యానించారు.